Water on empty stomach: తక్షణమే హైడ్రేషన్ అందించడం నుంచి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు ఖాళీ కడుపుతో నీరు త్రాగటం వల్ల కలిగే అనేక ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెల్సుకోండి.
ఉదయం లేవగానే చేసే పనులు రోజంతా ప్రభావం చూపుతాయి. మొదటగా ఏం తిన్నాం, ఏ పని చేశాం, దేని గురించి మాట్లాడాం? లాంటి విషయాలన్నీ రోజు మొత్తం ఎలా గడపబోతున్నామో నిర్ణయిస్తాయి. ఈ విషయాలన్నీ అందరికీ భిన్నంగా ఉంటుంది. కానీ అందరూ తప్పకుండా ఫాలో అయ్యే నియమం ఉదయాన్నే పరిగడుపున నీళ్లు తాగడం. ఇలా ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల ఏమేం లాభాలున్నాయో చూడండి.
రీహైడ్రేషన్:
మనం ప్రతిరోజూ 7-8 గంటలు నిద్రపోతున్నప్పుడు, ఆ సమయంలో శరీరం నిర్జలీకరణ లేదా డీహైడ్రేషన్‌కు గురికావడం సహజం. చెప్పాలంటే రోజులో మూడోవంతు ఏమీ తాగకుండా, తినకుండా ఉపవాసం ఉంటున్నట్లే. అందుకే పరగడుపున నీరు ఎక్కువగా తాగితే శరీరానికి వెంటనే హైడ్రేషన్ అవుతుంది. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల కోసం నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీటిని కూడా తాగవచ్చు.
చురుగ్గా చేస్తుంది:
డీహైడ్రేషన్ వల్ల నిద్ర లేవగానే శరీరం కదల్చాలంటే బద్ధకంగా అనిపిస్తుంది. శక్తి లేనట్లుగానే ఉంటుంది. మనం ఉదయాన్నే నీరు త్రాగినప్పుడు, ఇది శరీరానికి పునరుత్తేజం ఇవ్వడానికి సహాయపడుతుంది. మానసిక స్థితిని ఉత్తేజంగా చేస్తుంది. ఇది రోజును కొత్త ఉత్సాహంతో మొదలుపెట్టడానికి సాయపడుతుంది.
మెదడుకు ఇంధనం:
మానవ మెదడు సరిగ్గా పనిచేయడానికి తగినంత మొత్తంలో నీరు అవసరం. మనం శరీరానికి కావాల్సిన నీటిని అందించి, హైడ్రేటెడ్ గా ఉన్నప్పుడు స్పష్టంగా ఆలోచిస్తాం. నిర్ణయాలు సరిగ్గా తీసుకోగలుగుతాం. ఒక కొత్త రోజును సరిగ్గా మొదలుపెట్టగలం. ఇది పనిలోనూ, అన్నింటా మీ ఉత్పాదకను పెంచడానికి సాయపడుతుంది.
అనారోగ్యం:
నీరు తాగిన తర్వాత తగినంత హైడ్రేటెడ్ గా ఉన్నప్పుడు ఉదర సంబంధిత, కాలేయ, మూత్రపిండాల సంబంధిత వ్యాధుల లక్షణాలను తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఇది శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
చర్మం, జుట్టు అందం:
నీరు త్రాగటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మెరిసే చర్మం, మెరిసే జుట్టు పెరిగేలా సహాయపడుతుంది. తక్కువ వయసులోనే చర్మం మీద ముడతలు, సన్నని గీతలు రాకుండా చూస్తుంది. నీరు త్రాగటం వల్ల రక్త ప్రసరణను క్రమబద్ధీకరించడానికి, శరీరం నుండి విష పదార్థాల్ని బయటకు పంపేయడానికి సహాయపడుతుంది.