Heart attack with Constipation: మలబద్దకం ప్రాణాంతక వ్యాధికి కారణం కావచ్చు! టాయిలెట్ సీటుపై మీరు పెట్టే ఒత్తిడి మీ గుండెను ప్రమాదంలో పడేస్తుంది కాబట్టి ఈ లక్షణాలను గమనించండి. వెంటనే నివారణ చర్యలు తీసుకోండి.
మలబద్ధకం రోజూవారీ జీవితంలో ఉండే చిన్న సమస్య మాత్రమే కాదు. నిర్లక్ష్యం చేస్తే, అది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ తీవ్రమైన ఆరోగ్య సమస్యకు, మలబద్దకానికి మధ్య సంబంధం ఏంటో తెలియాలంటే ఇది చదవండి.
మలబద్ధకం చాలా మంది ఎదుర్కొంటున్న ఒక సాధారణ సమస్య. మల విసర్జనలో ఇబ్బందిని నిర్లక్ష్యం చేయకూడదు. మల విసర్జణ సాఫీగా జరగకపోవడం వల్ల ముక్కడం మొదలుపెడతారు. కడుపు మీద పడే ఒత్తిడి జీర్ణ వ్యవస్థమీదే కాకుండా, రక్తపోటును, హృదయ స్పందన రేటును కూడా ప్రేరేపిస్తుంది. హృదయ సంబంధ వ్యాధులకు దోహదం చేసే వాటిలో ఇవి ప్రధాన కారకాలు.
దీర్ఘకాలిక మలబద్ధకం, గుండె సమస్యలకు సంబంధం?
- గుండెపై ఒత్తిడి: దీర్ఘకాలిక మలబద్ధకం ఉన్న వ్యక్తి మల విసర్జణ కోసం ముక్కడం వల్ల ఒత్తిడి గుండె మీద, పొట్ట మీద పడుతుంది. ఈ అధిక ఒత్తిడి గుండెకు చేరుకునే రక్త ప్రవాహాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఇది గుండెకు సమర్థవంతంగా రక్త సరఫరా చేయడం కష్టంగా మారుస్తుంది.
- రక్త ప్రవాహం తగ్గడం: ఎక్కువసేపు ముక్కడం వల్ల శ్వాస బిగబడతారు. ఒత్తిడి పొట్ట మీద ఎక్కువగా పడుతుంది. ఇది మెదడు, గుండెకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
- గుండె జబ్బులు ఉన్నవారు: మలబద్ధకం వల్ల పెట్టే ఒత్తిడి గుండెపై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి ఇదివరకే గుండె జబ్బులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. కాలక్రమేణా ఇది రక్తపోటు, గుండెపోటు, స్ట్రోకులు, గుండె కవాట వ్యాధులు, గుండె ఆగిపోవడం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది.
- అనారోగ్యకర జీవనశైలి: పేలవమైన జీవనశైలి అలవాట్లు మలబద్దకం మొదలవడానికి కారణాలవుతాయి. ప్రాసెస్ చేసిన, ప్యాక్ చేసిన జంక్ ఫుడ్ తినడం, సోడియం, చక్కెర, ప్రిజర్వేటివ్స్, కృత్రిమ రంగులున్న పేలవమైన ఆహారపు అలవాట్లు మలబద్దక సమస్యలను కారణం. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఈ లక్షణాలు ఎప్పటికప్పుడు గమనించుకోవాలి.
గమనించాల్సిన లక్షణాలు:
• క్రమంగా లేని మలవిసర్జణ
• ముక్కినప్పుడు, ఆ తర్వాత కూడా ఛాతీలో పిండినట్లు అనిపించడం
• లయలో లేని హృదయ స్పందనలు, మీ గుండె వేగంగా కొట్టుకుంటున్నట్లు అనిపిస్తుంది.
• సరిపడా విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా అలసిపోయినట్లు అనిపిస్తుంది.
• కాళ్ళు లేదా చీలమండల వాపు వల్ల కదలిక కష్టం అవుతుంది.
- ముఖ్యంగా పడుకున్నప్పుడు తరచుగా దగ్గు వస్తుంది.
- రక్తపోటు స్థాయిలు అకస్మాత్తుగా పడిపోవడం లేదా హృదయ స్పందన కారణంగా మైకము అనిపిస్తుంది.
నివారణ
గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే ముందుగా మలబద్దకం సమస్య తగ్గిపోవాలి. దానికోసం పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు, కాయధాన్యాలు, చిక్కుళ్ళు తినడం అలవాటు చేసుకోవాలి. అలాగే శరీరం హైడ్రేటెడ్ గా ఉండేలా చూడాలి. మలం మృదువుగా ఉండటానికి కనీసం రోజుకు 1 నుంచి 2 లీటర్ల నీళ్లు తప్పక తాగాలి. 45 నిమిషాల కంటే ఎక్కువసేపు శారీరక కార్యకలాపాలు, వ్యాయామాలలో పాల్గొనడం మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటే, మల విసర్జనను సాఫీగా చేస్తుంది. మలబద్ధకం సమస్య రోజూవారీ జీవితం మీద ప్రభావం చూపిస్తే వెంటనే వైద్యుల్ని కలవండి. మలం సాఫీగా వచ్చేలా స్టూల్ సాఫెనర్లను వాళ్లు సూచిస్తారు.