Heart Health: వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరూ గుండెను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మీకు తెలియకుండా మీరు రోజు చేసే కొన్ని పనులు గుండె ఆరోగ్యాన్ని క్షీణించేలా చేస్తాయి. ఆ పనులు ఏంటో తెలుసుకొని మానేయండి.
Heart Health: గుండె ఆరోగ్యంగా ఉంటేనే మనిషి సంతోషంగా జీవించగలడు. గుండె సమస్యలు మనిషి జీవిత ఆయుష్షును తగ్గిస్తాయి. వయసుతో సంబంధం లేకుండా గుండె సమస్యలు వచ్చి పడుతున్నాయి. గుండె ఆరోగ్యం క్షీణించేలా మీకు తెలియకుండానే రోజూ కొన్ని పనులు చేస్తున్నారు. మీరు తినే దగ్గర నుంచి నిద్రపోయే విధానం వరకు ప్రతి చిన్న పని గుండెపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి మీరు చేస్తున్న కొన్ని పనులను మాని గుండెను కాపాడుకోండి. రోజువారీ పనులలో ఏవి గుండె ఆరోగ్యానికి క్షీణించేలా చేస్తున్నాయో ఇక్కడ ఇచ్చాము. మీరు ఇలాంటి తప్పులు చేస్తే వెంటనే మానుకోండి.
నిద్రా షెడ్యూల్
ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోయి ఉదయం ఒకే సమయానికి లేవడం అలవాటు చేసుకోవాలి. మనం ప్రతిరోజూ ఇలా నిద్రపోతే శరీరంలోని సిర్కాడియన్ రిథమ్ కూడా అదే టైమింగ్స్ ను సెట్ చేసుకుంటుంది. ఇది ఆరోగ్యకరమైన శరీరానికి అవసరం. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర షెడ్యూల్ చాలా ముఖ్యం. కానీ కొందరు రోజుకో సమయానికి నిద్రపోతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల గుండె ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రిపూట ఏడు గంటల కంటే తక్కువ సమయం నిద్రపోయే వ్యక్తులకు హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్రలేమి, అధిక రక్తపోటుకు దారితీస్తుంది. అధిక రక్తపోటు, గుండె జబ్బులకు కారణం అవుతుంది. కాబట్టి ప్రతి రాత్రి తగినంత విశ్రాంతి తీసుకోండి. అలాగే ప్రతి రాత్రీ ఒకే సమయానికి నిద్రపోవడం, ఉదయం ఒకే సమయానికి లేవడం అలవాటు చేసుకోండి.
శారీరక శ్రమ లోపించడం
ఇంట్లోనే ఉంటూ వ్యాయామంలాంటివి చేయకుండా ఉంటే గుండె ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లుతుంది. నిశ్చల జీవనశైలి అంటే ఎక్కువ సమయం పాటు కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం. వ్యాయామం చేయని వారిలో గుండె క్షీణించే అవకాశం ఉంది. శారీరక శ్రమ లేకపోవడం వల్ల అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, బరువు పెరగడం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇవన్నీ కూడా గుండె జబ్బులకు ప్రధాన కారణాలే. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం వ్యాయామం చేయకుండా నిశ్చల జీవనశైలి కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆరు శాతం మంది ఇలా నిశ్చల జీవనశైలి కారణంగానే మరణిస్తున్నారు. కాబట్టి సాధారణ దినచర్యలో వ్యాయామాన్ని భాగం చేసుకోండి. మెట్లు ఎక్కడం, దిగడం వంటివి చేయండి.
ఆహారపు అలవాట్లు
గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఆహారానిది కీలక పాత్ర. ప్రాసెస్ చేసిన ఆహారాలు, కొవ్వు నిండిన ఆహారాలు, చక్కెర నిండిన ఆహారాలు తింటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఊపకాయం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతాయి. వీటి వల్ల కూడా గుండెపోటు రావచ్చు. కాబట్టి మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్, తృణధాన్యాలు ఉండేలా చూసుకోండి.
ఒత్తిడి తగ్గించుకోండి
దీర్ఘకాలిక ఒత్తిడి గుండె ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మీకు ఒత్తిడిగా అనిపించినప్పుడు శరీరంలో కార్టిసాల్, అడ్రినలిన్ వంటి హార్మోన్లు ఎక్కువగా విడుదలైతాయి. ఇవి రెండూ కూడా రక్తపోటును పెంచుతాయి. దీర్ఘకాలికంగా ఒత్తిడి బారిన పడడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అతిగా తినడం, ధూమపానం, మద్యపానం వంటివి గుండె సమస్యలకు కారణం అవుతాయి.
మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు చేయించుకుంటూ ఉండాలి. ఇవి చేయించుకోవడం వల్ల గుండె ఆరోగ్యం తెలుస్తుంది. ప్రారంభ దశలోనే గుండె సమస్యను గుర్తిస్తే చికిత్స సులభతరం అవుతుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి రక్తపోటును తనిఖీ చేసుకుంటూ ఉండాలి. అలాగే సంవత్సరానికి ఒకసారి కొలెస్ట్రాల్ స్థాయిలను పరీక్షించుకోవాలి. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ఎంతవరకు పేరుకుపోయిందో తెలుసుకుంటే గుండె సమస్యను ముందే పసిగట్టవచ్చు.