Ways to lower high BP: ఎక్కువ మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో హై బీపీ ఒకటి. దీన్ని అదుపులో ఉంచుకోవాలంటే ప్రతిరోజు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఈ పనుల ద్వారానే సహజంగానే అధిక బీపీని కంట్రోల్ చేయవచ్చు.
Ways to lower high BP: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది హైబీపీతో బాధపడుతున్నారు. అధిక రక్తపోటుగా పిలిచే ఈ సమస్య ఒకసారి వచ్చిందంటే జీవితాంతం వెంటాడుతుంది. ఇది ఒక నిశ్శబ్ద కిల్లర్ అని చెప్పుకోవచ్చు. ఈ సైలెంట్ కిల్లర్ బారిన పడ్డాక చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది మూత్రపిండాల వైఫల్యానికి కారణం కావచ్చు. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి హైబీపీని అదుపులో ఉంచుకోవాలంటే కేవలం మందుల ద్వారానే కాదు, ప్రతిరోజూ మీరు కొన్ని పనులు చేయడం ద్వారా కూడా బీపీ పెరగకుండా అదుపులో ఉంచుకోవచ్చు. దీనివల్ల గుండె ఆరోగ్యం చక్కగా ఉంటుంది.
సోడియం తగ్గించండి
అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు, బాధపడని వారు కూడా ఆహారంలో సోడియం తగ్గించడం చాలా ముఖ్యం. సోడియం ఎక్కువగా ఉప్పులోనే ఉంటుంది. కాబట్టి ఉప్పును ఎంత తక్కువగా తింటే అంత మంచిది. అధిక ఉప్పు శరీరంలో చేరితే అది నీటిని నిలిచిపోయేలా చేస్తుంది. దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది. రుచి కోసం ఉప్పును కాకుండా ఇతర సుగంధ మూలికలను వాడడం మంచిది.
వ్యాయామం
రక్తపోటును అదుపులో ఉంచడానికి సులువైన మార్గం. వ్యాయామం చేయడం ప్రతిరోజూ కాసేపు నడకా లేదా సైక్లింగ్, ఈత వంటివి చేయండి చాలు. హైబీపీ కంట్రోల్ అయిపోతుంది. రోజుకి అరగంట పాటు ఈ వ్యాయామాలు చేస్తే రక్తపోటు పెరగకుండా ఉంటుంది. తోటపని చేయడం, మెట్లు ఎక్కడం వంటివి కూడా గుండె ఆరోగ్యం పై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి.
ఒత్తిడి
దీర్ఘకాలం పాటు ఒత్తిడితో ఉన్నట్టయితే మీకు అధిక రక్తపోటు త్వరగా వచ్చేస్తుంది. హై బీపీ బారిన పడినవారు ఒత్తిడిని చాలా వరకు తగ్గించుకోవాలి. లేకుంటే తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు, యోగా వంటివి ప్రతిరోజూ అభ్యాసం చేస్తూ ఉండాలి. ఒత్తిడి రక్తపోటును పెంచుతుంది. కాబట్టి ఒత్తిడిని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది.
కెఫీన్ వద్దు
ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న టీ, కాఫీలను తాకకుండా మాత్రం కొంతమంది ఉండలేరు. కాఫీలు, టీలను అధికంగా తాగితే వారి శరీరంలో కెఫీన్ చేరుతుంది. అలాగే ఆల్కహాల్ తాగే వారిలో కూడా రక్తపోటు సమస్య పెరుగుతుంది. కెఫీన్, ఆల్కహాల్‌లో ఉండే సమ్మేళనాలు అధిక రక్తపోటును మరింతగా పెంచుతాయి. కాబట్టి రక్తపోటు అదుపులో ఉండాలంటే వెంటనే టీ, కాఫీలు, మద్యపానం మానేయండి.
ఆరోగ్యకరమైన ఆహారం
మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం తినడం ద్వారా రక్తపోటును తగ్గించుకోవచ్చు. మీరు తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్, తృణధాన్యాలు ఉండేలా చూసుకోండి. అలాగే పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను ఎంపిక చేసుకోండి. చిలగడదుంపలు, అరటి పండ్లు, పాలకూర కచ్చితంగా తినండి. సోడియం స్థాయిలను తగ్గించండి. ఇలా చేస్తే రక్తపోటు పెరగదు.
పైన చెప్పిన ఐదు సూత్రాలను పాటిస్తే చాలు. అంతే హైబీపీ అమాంతం సాధారణంగా మారిపోతుంది. మీరు ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు. రక్తపోటు పెరుగుతుందేమోనని భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు.