Potato Cooking: బంగాళదుంపల్లో పిండి పదార్థం అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు తినకూడదు. బంగాళదుంపల్లో స్టార్చ్ ను ఎలా తగ్గించాలో తెలుసుకోండి.
Potato Cooking: బంగాళదుంపలతో చేసే వంటకాలు టేస్టీగా ఉంటాయి. అందుకే పిల్లలు ఇష్టంగా తింటారు. కానీ బంగాళదుంపల్లో పిండి పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ స్టార్స్ కంటెంట్ అధికంగా ఉండడం వల్లే బరువు తగ్గాలనుకునే వారు, మధువేహం ఉన్నవారు వీటిని తినకూడదు. సామాన్యులు కూడా బంగాళదుంపను అధికంగా తినడం అనారోగ్యకరమే. వాటిని తినే పద్ధతిలో తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.
బంగాళాదుంపల్లోని స్టార్చ్ కంటెంట్‌ను తగ్గించడానికి కొన్ని సులువైన మార్గాలు ఉన్నాయి. ఎప్పుడైతే పిండి పదార్థాలు తగ్గుతాయో అప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు ప్రభావితం కాకుండా ఉంటాయి. బరువు కూడా అదుపులోనే ఉంటుంది. డయాబెటిస్ వారు పూర్తిగా బంగాళదుంపలను మానేయాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు పిండి పదార్థాలను బాగా తగ్గించిన దుంపలను తినవచ్చు. అయితే బంగాళదుంపల్లో స్టార్చ్ కంటెంట్ ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోండి.
నానబెట్టండి
బంగాళదుంపల్లో పిండి పదార్థాలను తగ్గించడానికి ఆ దుంపలను నానబెట్టడం ముఖ్యమైన పద్ధతి. చల్లటి నీటిలో బంగాళదుంపను ముక్కలుగా కోసి అరగంట పాటు వదిలేయండి. నీరు... ఆ పిండి పదార్థాన్ని లాగేసుకుంటుంది. దీని వల్ల చాలా వరకు స్టార్స్ కంటెంట్ తగ్గిపోతుంది. బాగా కడిగితే చాలావరకు అందులోని స్టార్చ్ బయటికి పోతుంది.
నిమ్మరసం చేర్చి
బంగాళాదుంపలను వండేటప్పుడు స్టార్చ్ ప్రభావాన్ని తగ్గించడానికి వెనిగర్ లేదా నిమ్మ రసాన్ని ఉపయోగించవచ్చు. ఈ రెండూ కూడా ఆమ్ల పదార్థాలు. ఆమ్లపదార్థాలు పిండి పదార్థం అణువులతో సంకర్షణ చెందుతాయి. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలపై ఎలాంటి ప్రభావం పడదు. బంగాళదుంపలను ఉడికించేటప్పుడు ఆ నీటిలో రెండు చుక్కలు వెనిగర్ వేసినా కూడా మంచిదే, లేదా నిమ్మరసాన్ని పిండినా కూడా స్టార్చ్ కంటెంట్ చాలా వరకు తగ్గుతుంది.
వండే పద్ధతి
బంగాళదుంపలను వండే పద్ధతి కూడా అందులోని పిండి పదార్థాలను రెట్టింపు చేయాలా? లేక తగ్గించాలా? అనేది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు బంగాళదుంపలను నూనెలో వేయిస్తే పిండి పదార్థాలు మరింతగా పెరుగుతాయి. దానికి బదులు బంగాళదుంపలను ఉడికించి వండితే దాదాపు సగం వరకు పిండి పదార్థాల శాతం తగ్గుతుంది. అలాగే బంగాళదుంపలను తొక్క తీయకుండానే వండాలి. తొక్క తీసి వండితే పిండి పదార్థాలు అన్నీ మన శరీరంలో చేరుతాయి. తొక్క తీయకుండా వండితే పిండి పదార్థాల శాతం తగ్గే అవకాశం ఉంది. కాల్చడం, వేయించడం వంటివి మాత్రం చేస్తే బంగాళదుంపల్లో పిండి పదార్థాలు రెట్టింపు అవుతాయి.
చిన్న ముక్కలుగా కట్ చేసి
బంగాళదుంపలను ముందుగానే చిన్న ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి వదిలేయండి. తెల్లని పిండి ఓ అరగంటకు మీకు కనిపిస్తుంది. దాన్ని మళ్ళీ వేరొక నీటిలో వేసి మరొక పావుగంటసేపు ఉంచండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేస్తే త్వరగా పిండి పదార్థాలు బయటికి వస్తాయి. కాబట్టి మీరు సింపుల్ గా వండేసుకోవచ్చు.
మధుమేహం ఉన్నవారే కాదు లేని వారు కూడా బంగాళదుంపలను అధికంగా తినడం మంచిది కాదు. ప్రతిరోజూ బంగాళదుంపలను తిడితే రక్తంలో చక్కెర స్థాయిలు ప్రభావితం అవుతాయి. కాబట్టి బంగాళదుంపలు వండే ముందు ఎక్కువ సేపు నీటిలో ఉంచడం లేదా ఉడకబెట్టడం కచ్చితంగా చేయండి. అందులోని ఎంతో కొంత పిండి పదార్థాలు బయటికి పోవాలి. అప్పుడే అవి ఆరోగ్యకరమైనవిగా మారుతాయి.